Monday, July 21, 2014

నన్ను వదిలెయ్యండి మహప్రభో

పాతీధి తూముదగ్గిర పనీపాటాలేని సన్నాసుల ఊసుపోని కబుర్లన్నీ ఫేస్బుక్కు గోడెక్కేహినియ్యంట
కాపోతే ఇంతకుముందేమో ఊళ్ళో రాజకీయాలు మట్టుకే... ఇప్పుడెమో పెపంచమ్మొత్తమ్మీదా పనికిమాలిన చెత్తంతా ఏరి పోగేసి మరీ గొళ్ళమీదెట్టెస్కుంటున్నారంట జనాభా...

ఫలానా జబ్బుకి ఫలానా మందని ఇదివరకు డాక్టర్లు చెప్పేవోళ్ళు... ఇప్పుడైతే మరి డాక్టర్లకి కూడా తెలీని జబ్బులకి ఎవడుపడితే ఆడు మందులు రాసేత్తన్నాడు మరి ఫేస్బుక్కు వాడ్డం వచ్చేత్తే ఎంబీబీఎస్ కూడా చదివేహినట్టే. మందేస్కునేది మనంగాకపోతే మనంజెప్పేదే ఆయుర్వేదం అన్నాట్ట ఎనకటికి ఎంకటసుబ్బి

గడ్డిమేటుకాడ గంగిరెద్దు ఈనిందంటే దూడనట్టుకొచ్చి దొడ్లో కట్టైమన్నాడంట... విండానికి పాతగా ఉందా ఈ మద్దెన కనపడకుండా పోయిన మలేషియా ఇమానం ఎన్నిసార్లు, ఎన్నిచోట్ల ఫేస్బుక్కులో  దొరికేసిందో మరి. ఈ ఇసయం దెలీక పాపం జనాలు ఇంకా ఎతుకుతానే ఉన్నారు...

(కాసేపు నవ్వు పక్కనపెట్టి అలోచించండి, అందులో మనకి కావల్సిన వాళ్ళుంటే లేనిపోని ఆశలు కల్పించినందుకు ఎంత బాధగా ఉంటుందో. ఇలాంటివి పుట్టించేవాడు ఎక్కడో ఏటికో కోటికో ఒక్కడుంటాడు, వ్యాప్తించేవాళ్ళు మాత్రం కోకొల్లలు)

మొన్నామజ్జిన పొరుగూరెల్లినపుడొరే, చూహేన్రా బాబు అసలా... కళ్ళు బయిర్లుగమ్మేసినియ్యి వింత చూసి. పిల్లి అచ్చు ఎలకలా ఉందిరా. ఫోటో తీసి గోడమీదెట్టేహేను నువ్వు చెప్తే నమ్మవనీ...
బాబయ్యా! ఫొటోషాపని ఆడెవడో కనిపెట్టి జనాలమీదకొదిలేసాడు. దాంతో ఏం చెయ్యచ్చో చెప్పడం కన్నా ఏం చెయ్యలేమో చెప్పడం సుళువేమో.

నేనుతెలుసా ఒరే మొన్న, రెందొందల కారెట్లూ ఓ వంద బంగళా దుంపలూ ఒక్కదెబ్బలో తుక్కుకింద కొట్టి చెత్త బుట్టలో పడేసేన్రా... దమ్ముంటే నువ్వు కూడా చెయ్యి చూద్దాం! ఛాలెంజ్ పెట్టా చూడు నీ గోడ మీద. ఒరేయ్ నువ్వు నిజంగా గొప్పోడివిరా అన్ని కూరగయలుంటే బయట దుకాణం పెట్టి ఈ పాటికి లచ్చాధికారినైపోయే వాడిన్రా నేనైతే, ధరలలా మండిపొతున్నాయి మా ఊళ్ళో... అయ్యాలారా! మీకు పనీ పాటా లేవని అందరికీ చెప్పుకోనక్కర్లేదు... మీ వీపు దురదగా ఉంటే ధారళంగా గోక్కోండి, ఆ గజ్జి నాకెందుకు?

(మీ దయవల్ల గూగుల్ లాంటి కంపెనీలు ఇస్త్రీ బట్ట నలక్కుండా కోటానుకోట్లు సంపాయించేస్తున్నారు, ఆళ్ళని కూడా కొంచెం ఒళ్ళు వంచి పనికొచ్చే వస్తువులు కనిపెట్టే అవకాశం కల్పించ ప్రార్ధన

ప్రార్ధనంటే గుర్తొచ్చింది, కవితకేదీ అనర్హం కదేమో కానీ హాస్యానికి ఎప్పుడూ హద్దులుంటాయి అవి మీరితే అంత మంచిది కాదని క్లుప్తంగా నా మనవి! )


No comments: